Tollywood singers

Vemuri Gaggaiah

 వేమూరి గగ్గయ్య మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ఈయన 15 ఆగస్టు 1895 తేదీన గుంటూరు జిల్లా వేమూరు లో జన్మించారు. దుష్టపాత్రలు ధరించేవాళ్లకు ప్రేక్షకాదరణా, ప్రేక్షకారాధనా వుండవన్న నిజాన్ని అబద్ధం చేసిన వేమూరి గగ్గయ్య నాటి చిత్రాల మహోజ్జ్వలతార! రౌద్రపాత్రధారణకు మార్గదర్శి. సినిమాలలో రాక ముందు ప్రసిద్ధి చెందిన రంగస్థల నటుడైన గగ్గయ్య క్రూర పాత్రలకు పెట్టింది పేరు. సినిమా నటుడైన తర్వాత, ప్రేక్షకజనం విడిగా గగ్గయ్యని చూడాలని ఉబలాటపడేవారు, వెంటపడేవారు. అంతకు ముందు సినిమాలు చూసి వచ్చినవాళ్లు ఊరికే పేరు చెప్పుకుని ఊరుకునేవారు గాని గగ్గయ్యతో ఊరుకోలేదు. ఒక విధంగా తారారాధన గగ్గయ్యతోనే మొదలైందని చెప్పవచ్చు.

ఆయన చిన్నతనంలో సంగీత సాధనతో మొదలైన కళాభిమానం - నటనవైపు తిరిగింది. తానుగా నటనను అభ్యసించి, ధాటిగా పెద్దశ్రుతితో పద్యాలు ఆలపించడంలో దిట్ట అనిపించుకుని సురభివారి నాటకాల్లో పాత్రలు ధరించడంతో నటజీవితం ఆరంభించారు గగ్గయ్య. నాటకాలతో ఊళ్లూ, దేశాలూ తిరిగారు. ఒక్క రంగూన్‌లోనే పదిమాసాలపాటు వుండి నాటకాలు ప్రదర్శించారుట!

తర్వాత తెనాలి వచ్చి ఫస్టుకంపెనీ అనే నాటక సంస్థలో చేరి, పాత్రధారణ చేశారు. మైలవరం కంపెనీ మహానందరెడ్డి బృందం గగ్గయ్యగారి నటనాశక్తిని బాగా వినియోగించుకున్నాయి. నాటకాల్లో నటిస్తున్నా సాధన మానలేదు. కంఠానికి పదునుపట్టి, తారాస్థాయిలో పద్యం చదవడం అలవాటు చేసుకున్నారు. మైకులూ, స్పీకర్లూ అన్నవి ఎరగని రోజులు గనక, పాత్రధారులందరూ గట్టిగా పద్యాలు చదవడం, సంభాషణలు చెప్పడం వున్నా - గగ్గయ్యగారి గాత్రం మాత్రం - ఎంత దూరానికో వినిపించేదట! దుష్టపాత్రలు అభినయించడం ఆరంభించిన దగ్గర్నుంచి ఆ పాత్రధారణకు ఆయనే సాటి! యముడుగానో, కంసుడుగానో, ఆయన రంగప్రవేశం చెయ్యడంతోటే - ప్రేక్షకులు కరతాళధ్వనులు చేసేవారు.

ఖంగుమనే కంఠంతో, ప్రతి అక్షరాన్నీ సుస్పష్టంగా పలుకుతూ, భావయుక్తంగానూ, రాగయుక్తంగానూ పాడి వన్స్‌మోర్‌లు కురిపించుకునేవారు వేమూరివారు. ఆయనది పెద్ద శరీరం కాదు, కాని పాత్రలో గంభీరాకృతితో ‘పర్వతప్రమాణం’లో కనిపించేవారు. కళ్లు పెద్దవి శరీరం కాదు, కాని పాత్రలో కణకణలాడుతున్న చింతనిప్పుల్లా - అంతంత కళ్లు కనిపించేవి. అందుకనే అందరూ ముందు వరుసల్లో కూచునే గగ్గయ్య నాటకాలు చూడాలని చెప్పుకునేవారు.

నాటకంలో ఎవరున్నా లేకపోయినా, గగ్గయ్య వున్నారని తెలిస్తే చాలు - గ్రామాలనుంచి ప్రజలు బళ్లమీద తరలివచ్చేవారనీ, నాటకాల్లో నటిస్తున్నప్పుడే ఆయనకు ‘స్టేజిస్టార్‌’గా గుర్తింపు వుండేదనీ, - చెబుతారు. రంగస్థలంమీద ధరించిన క్రూరపాత్రలే సినిమాల్లోనూ వరించాయి. ఆ పాత్రలకి గగ్గయ్య, గగ్గయ్యకి ఆ పాత్రలూ అలా ఇమిడిపోయాయి.

ఈస్టిండియావారి సావిత్రి (1933)లో యమధర్మరాజు పాత్రతో గగ్గయ్య సినిమారంగప్రవేశం జరిగింది. ఆయన సావిత్రి నాటకంలో యముడిపాత్ర సమర్థంగా పోషించారు గనక, సినిమాల్లోకి తీసుకున్నారు. ఆచిత్రంలోని పో బాల పొమ్మికన్‌, ఈ మృగారణ్యమున రావలదు, రా తగదు, రాచనదు పో బాల పొమ్మికన్‌ అని లయబద్ధంగా మాటలు విరుస్తూ విసుర్తూ కోపకంఠంతో సావిత్రిని ఉద్దేశిస్తూ పాడిన పాటకి - ప్రేక్షకులు లయబద్ధంగా చప్పట్లు కొట్టి వెర్రెత్తిపోయారు. అది సినిమా అని తెలిసినా, ఆయన చదివిన పద్యాలకి ‘వన్స్‌మోర్‌’లు కొట్టారు. ఆ చిత్రం తొలి తెలుగు చిత్రం భక్తప్రహ్లాద (1931) కంటే విజయవంతం కావడంతో ప్రజల పాలిట యముడైన యమధర్మరాజు ప్రేక్షకులకు చేరువైనాడు!

మరణం

30 డిసెంబర్ 1955 తేదీన సహజ మరణం పొందినప్పుడు అటు నాటకరంగం, ఇటు సినిమారంగం, ప్రేక్షక సమూహం ఎంతగానో విలపించాయి.

నటించిన సినిమాలు 1. భక్త శిరియాళ (1948) - 2. గరుడ గర్వభంగం (1943) 3. భక్త ప్రహ్లాద (1942) - 4. సీతారామ జననం(1942) రావణాసురుని పాత్ర 5. దక్షయజ్ఞం(1941) - 6. చండిక (1940) గిరిరాజు పాత్ర - 7. మైరావణ (1940) 8. జరాసంధ (1938) - 9. మార్కండేయ (1938) 10. మోహినీరుక్మాంగద (1937)

 

Recent Videos

3980 views - 0 comments
4555 views - 1 comment
4050 views - 0 comments
4397 views - 0 comments